: ‘కాల్’నాగులంతా నేతాశ్రీల అనుచరులే... 44 మందికి వైసీపీతో సంబంధాలు, ఆరుగురికి కామ్రేడ్లతో లింకులు
విజయవాడలో వెలుగుచూసిన కాల్ మనీ దందా ఏపీ వ్యాప్తంగా సాగుతోందని దాదాపుగా నిర్ధారణ అయ్యింది. పేర్లు వేరైనా జనాల అత్యవసరాలే ఆసరాగా రంగ ప్రవేశం చేసిన ‘కాల్’నాగులు అధిక వడ్డీల పేరిట జనాన్ని పీల్చి పిప్పి చేశారు. అంతటితో ఆగకుండా వసూళ్ల పేరిట బెదిరింపులకు దిగడమే కాక రుణ గ్రహీతల ఇళ్లల్లోని మహిళలపై అత్యాచారాలకూ దిగారు. మరో అడుగు ముందుకేసిన విజయవాడ కాల్ మనీ వ్యాపారులు మహిళలను వ్యభిచార కూపంలోకి నెట్టేశారు. దీనిపై గడచిన రెండు రోజులుగా ఏపీ వ్యాప్తంగా పోలీసులు ముమ్మర దాడులు చేశారు. నిన్న రాత్రిదాకా మొత్తం 118 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 83 మందికి రాజకీయ అండ ఉందని తేలింది. అరెస్టైన వారిలో 44 మందికి విపక్ష వైసీపీతో లింకున్నట్లు తేలిపోగా, అధికార పార్టీ టీడీపీకి చెందిన నేతల అనుచరులు 20 మంది ఉన్నారు. ఇక 13 మంది ‘కాల్’నాగులకు కాంగ్రెస్ తో సంబంధాలు ఉండగా, పోలీసులను షాక్ కు గురి చేస్తూ ఓ ఆరుగురికి వామపక్ష పార్టీ సీపీఐతో సంబంధాలున్నట్లు తేలింది. ఇక మిగిలిన ‘కాల్’ నాగుల నేపథ్యంపై పోలీసులు కూపీ లాగుతున్నారు.