: సినిమాలు చూడటంలో మనోడి రికార్డు బద్దలైంది!
సినిమాలు చూడటంలో భారతీయుడు నెలకొల్పిన గిన్నిస్ రికార్డును కెనడాకు చెందిన సురేష్ జోచిమ్ బద్దలు కొట్టాడు. ఏకథాటిగా 121 గంటల 18 నిమిషాల పాటు నిద్రపోకుండా సినిమాలు చూశాడు. ఈ సినిమాలన్నింటిని దక్షిణాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్ లో టెల్కామ్ కు చెందిన బోల్ట్ స్పీడ్ ఫైబర్ ద్వారా చూశాడు. ఈ సందర్భంగా సురేష్ జోచిమ్ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికాదేశంలో ఇది తన మొదటి టైటిలని, ఈ రికార్డు నెలకొల్పడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. బోల్ట్ స్పీడ్ ఫైబర్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ జాక్వి మాట్లాడుతూ, ఫైబర్ స్ట్రీమింగ్ ద్వారా ఇన్ని గంటలపాటు సినిమాలు చూసిన రికార్డు ఇదేనని, ఈ రికార్డు నెలకొల్పడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కాగా, మన దేశానికి చెందిన ఆశిష్ శర్మ ఏకథాటిగా 120 గంటల 13 నిమిషాల పాటు 48 సినిమాలు చూసి గతంలో గిన్నిస్ రికార్డు కెక్కాడు. ఆ రికార్డును సురేష్ జోచిమ్ ఇప్పుడు అధిగమించాడు.