: రిలయన్స్, ఓఎన్జీసీ వివాదంలోకి మోదీ సర్కారు!


ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ మధ్య నెలకొన్న సహజవాయు వివాదాన్ని పరిష్కరించేందుకు మోదీ సర్కారు రంగంలోకి దిగింది. ఈ రెండు సంస్థల మధ్య సామరస్యం నెలకొల్పేందుకు ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అజిత్ ప్రకాష్ షా నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ గతంలో అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ డిగ్లోయర్ అండ్ మాక్ నౌటన్ ఇచ్చిన నివేదికను పరిశీలించి, ఇరు సంస్థల మధ్యా నెలకొన్న గొడవను తీర్చేందుకు సిఫార్సులు చేయనుంది. కాగా, గతంలో డీగ్లోయర్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో, ఓఎన్జీసీ అధీనంలోని గోదావరి బేసిన్ లో ఉన్న పీఎంఎల్ మరియు కేజీ -డీ5 బేసిన్ నుంచి 11 బిలియన్ ఘనపు మీటర్ల సహజవాయువు రిలయన్స్ నేతృత్వంలోని కేజీ-డీ6కు తరలి వచ్చిందని నివేదిక ఇచ్చింది. ఈ సహజవాయువులో తమకూ వాటా ఇవ్వాలని ఓఎన్జీసీ డిమాండ్ చేస్తుండగా, తమకేమీ సంబంధం లేదని రిలయన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎక్స్ఛేంజ్ రేట్ల ప్రకారం, ఈ గ్యాస్ ధర రూ. 11,300 కోట్లు కాగా, వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. "ఒకవేళ సహజవాయువు ఓఎన్జీసీ క్షేత్రాల నుంచి రిలయన్స్ క్షేత్రాలకు తరలివెళ్లి వుంటే, ఇరు పక్షాలకూ మధ్యేమార్గంగా నిర్ణయం తీసుకోవాలన్నది మా నిర్ణయం" అని చమురు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News