: భారత సాంకేతిక గతిని మార్చేందుకు గూగుల్ తీసుకున్న 9 నిర్ణయాలు
గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్, తన భారత పర్యటనలో భాగంగా ఈ ఉదయం ప్రసార మాధ్యమాల ప్రతినిధులు, డెవలపర్లు, ఔత్సాహికులు, మార్కెటింగ్ నిపుణులతో సమావేశమయ్యారు. ఆయన ప్రసంగిస్తూ, భారత సాంకేతిక గతిని మార్చేలా గూగుల్ తీసుకున్న 9 నిర్ణయాల గురించి వెల్లడించారు. అవి ఏంటంటే... * వచ్చే మూడేళ్లలో 3 లక్షల గ్రామాలకు చెందిన మహిళలకు ఇంటర్నెట్ ను దగ్గర చేస్తామని సుందర్ వివరించారు. ఇందుకోసం ఓ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నామని దానికి 'ఇంటర్నెట్ సాథీ' అని పేరు పెట్టామని వెల్లడించారు. * ఇండియాలో తమ సేవలను రెట్టింపు స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా దక్షిణాది నగరం హైదరాబాద్ లో అతిపెద్ద ఇంజనీరింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. * 11 భారతీయ భాషల్లో టైపింగ్ ను మరింత సులభతరం చేసేలా 'ఇండిక్' కీబోర్డు విడుదల చేయనున్నామన్నారు. * 2017 నాటికి 500 రైల్వే స్టేషన్లలో వైఫై సెంటర్లు ఏర్పాటు చేస్తామని, డిసెంబర్ 2016 నాటికి 100 స్టేషన్లలో ఈ సదుపాయం దగ్గరవుతుందని చెప్పారు. * వచ్చే సంవత్సరం నుంచి గూగుల్ సెర్చ్ లో ఇండియన్స్ కు ఎంతో ప్రియమైన క్రికెట్ లైవ్ అప్ డేట్స్ అందిస్తామన్నారు. * ప్రతి భారతీయుడి తొలి అడుగు 'ఇంటర్నెట్ యాక్సెస్' అయ్యేలా చూస్తాం. ఆపై సరైన సమయంలో సరైన సమాచారం వారికి దగ్గరయ్యేందుకు కృషి చేస్తాం. * ఇండియాకు సంబంధించినంత వరకూ ఇకపై ఏ నిర్ణయం తీసుకున్నా అది పై మూడు అంశాలకూ చెందినదై ఉంటుంది. తక్కువ స్పీడు ఉన్న నెట్ కనెక్షన్లతోనూ మెరుగైన సేవలందించేందుకు చూస్తామని సుందర్ తెలిపారు. * వచ్చే సంవత్సరం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న అమెరికన్ల కన్నా భారతీయుల సంఖ్య పెరగనుంది. ఇది ఇండియాను గూగుల్ కు హోం మార్కెట్ గా మారుస్తుంది. * రెండేళ్ల క్రితం ప్రకటించిన ప్రాజెక్ట్ లూన్ ను ఇండియాకు తీసుకువస్తాం. అతి తక్కువ ధరకు ఇంటర్నెట్ ను గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కీం అందిస్తుంది. చివరిగా "ఈ దేశం నాకెంతో ఇచ్చింది. అందుకు ప్రతిగా గూగుల్ తరఫున నేను కూడా ఈ దేశానికి ఎంతో కొంత ఇస్తాననే అనుకుంటున్నా" అంటూ సుందర్ పిచాయ్ తన ప్రసంగాన్ని ముగించారు.