: పార్లమెంటులో జైట్లీ పచ్చి అబద్ధాలు... ఇదిగో సాక్ష్యం!: కేజ్రీవాల్
దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి, బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి మధ్య రాజకీయ యుద్ధం మరింత వేడెక్కింది. నిన్న కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్రకుమార్ పై సీబీఐ దాడుల అనంతరం, తనపై ప్రతీకారంగానే ఈ దాడులను చేయించారని కేజ్రీవాల్ ఆరోపించగా, జైట్లీ దాన్ని తప్పుబట్టారు. ఈ సోదాలకు, రాజకీయాలకూ సంబంధం లేదని పార్లమెుంటులో జైట్లీ ప్రకటించగా, ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కేజ్రీ మండిపడ్డారు. తన కార్యాలయంలోని దస్త్రాలను చదివారని, సీబీఐ చెబుతున్న కేసుకు సంబంధం లేని కాగితాలను ఎందుకు చూడాల్సి వచ్చిందని ప్రశ్నిస్తూ, గత నెలలోని 'ఐటమ్ 7' ఫైల్ మూమెంట్ రిజిస్టర్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. పార్లమెంటు సాక్షిగా తప్పుడు మాటలు మాట్లాడటం ఎంత వరకూ సరైనదో ఆయనే తెలుసుకోవాలని హితవు పలికిన కేజ్రీ, తన కార్యాలయంలోని డీడీసీఏ ఫైల్ ను వారు చదివారని, ఆపై తాను మీడియా సమావేశం నిర్వహించడంతో వదిలేశారని, లేకపోతే ఆ ఫైల్ ను తీసుకువెళ్లేవారని కేజ్రీ వాల్ అన్నారు. అయితే, దాని కాపీని వారు తీసుకున్నారో? లేదో? స్పష్టంగా తెలియదని అన్నారు. ఢిల్లీ సర్కారు డీడీసీఏ కేసును విచారిస్తుంటే జైట్లీ ఎందుకు భయపడుతున్నారని, ఆ స్కాములో ఆయన ప్రమేయముందా? అని జైట్లీని ప్రశ్నించారు.