: సల్మాన్ కేసులో ఆ మిస్టరీ కానిస్టేబుల్ ఎవరు?... మొదలైన కొత్త వేట!
2002 నాటి 'హిట్ అండ్ రన్' కేసులో బాంబే హైకోర్టు సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా ప్రకటించినా, ఆయన కష్టాలు ఇప్పట్లో తీరేవిగా లేవు. యాక్సిడెంట్ జరిగిన నాడు సల్మాన్ ఖాన్ ను ఆసుపత్రికి తరలించిన బకిల్ నంబర్ 2985గా ఉన్న కానిస్టేబుల్ ఎవరన్న ప్రశ్నకు ఇప్పటివరకూ సమాధానం లభించకపోగా, ఆ కానిస్టేబుల్ ను వెతికే పనిలో ముంబై పోలీసు యంత్రాంగం కొత్త వేటను మొదలు పెట్టింది. ఆ మిస్టరీ కానిస్టేబుల్ ఎవరన్న విషయాన్ని కనుగొని, కొత్త సాక్షిగా చేర్చి కేసును తిరగదోడాలన్నది పోలీసుల ఉద్దేశంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన నాడు ఏపీఐ విజయ్ సాలుంకే ఘటనాస్థలిలో ఉండగా, సల్మాన్ ను జేజే ఆసుపత్రికి తీసుకువెళ్లి, రక్త నమూనాలు తీయించి మద్యం ఆనవాళ్లను గుర్తించే బాధ్యతను మరో కానిస్టేబుల్ కు అప్పగించాడు. ఇప్పుడు అతని వరుస సంఖ్య తప్ప పోలీసుల వద్ద మరే సమాచారమూ లేదు. విచారణ సందర్భంగా ఆ కానిస్టేబుల్ ఎవరన్న విషయం తనకు గుర్తు లేదని సాలుంకే వెల్లడించిన విషయాన్ని అప్పట్లో ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. "ఆ కానిస్టేబుల్ ఎవరో తెలియకపోవడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పుడు మేము అన్ని డాక్యుమెంట్లనూ పరిశీలిస్తున్నాం. 2002లో అన్ని పోలీసు స్టేషన్లలో పనిచేసిన వారినీ ప్రశ్నిస్తున్నాం" అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. అయితే, ఆ కానిస్టేబుల్ బాంద్రా పీఎస్ కు చెందిన వాడని, అతను విచారణకు సహకరించడం లేదని పోలీసు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే, 'మిడ్ డే' ప్రచురించిన కథనం ప్రకారం 2985 బకిల్ నంబర్ గా ఉన్న కానిస్టేబుల్ పేరు శివాజీ సావంత్ అని పేర్కొంది. అయితే, ఆయన 1998లోనే పదవీ విరమణ చేసినట్టు రికార్డులు ఉన్నాయి. ఆయన కుమారుడు ప్రస్తుతం కాలాచూకీ స్టేషన్ లో పనిచేస్తున్నాడు. తన తండ్రి బాంద్రా పీఎస్ లో ఎన్నడూ పనిచేయలేదని అంటున్నాడు. ఇక ఈ మిస్టరీ వీడేదెన్నడో!