: స్వచ్ఛ భారత్ కు ప్రపంచ బ్యాంకు దన్ను...రూ.10,500 కోట్ల సాయానికి గ్రీన్ సిగ్నల్
ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు స్వచ్ఛ భారత్ మిషన్ కు ప్రపంచ బ్యాంకు దన్ను లభించింది. దేశంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి రూ.10,500 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్ లో వరల్డ్ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ ఒన్నో రుహుల్ నిన్న ఢిల్లీలో స్పష్టమైన ప్రకటన చేశారు. దేశంలో నమోదవుతున్న ప్రతి 10 మరణాల్లో ఒకటి పారిశుద్ధ్యం లోపించిన కారణంగా జరుగుతున్నదేనని వరల్డ్ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పారిశుద్ధ్య కల్పనకు ఇతోధికంగా నిధులు అందించాలని ప్రపంచ బ్యాంకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే భారత్ లో అమలవుతున్న స్వచ్ఛ భారత్ మిషన్ కు రూ.10,500 కోట్లు అందించేందుకు ఆ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ నిధుల వినియోగాన్ని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య కల్పన మంత్రిత్వ శాఖ పర్యవేక్షించనుంది.