: 'కాల్ మనీ తీవ్రత అధికం... సెలవులో వెళ్లడం లేదు: గౌతమ్ సవాంగ్
కాల్ మనీ కేసు తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా తన సెలవులను రద్దు చేసుకుంటున్నట్టు విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. కాల్ మనీ కేసులో తమపై ఒత్తిడి లేదని, రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయని, కేసు వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని ఆయన మీడియాకు తెలిపారు. ఈ కేసులో ఏ ఒక్క అంశాన్నీ వదిలిపెట్టరాదన్న ఉద్దేశంతోనే తన సెలవును రద్దు చేయాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. ఈ కేసులో భాగంగా ఇప్పటివరకూ 75 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించామని, వందల కొద్దీ ప్రాంసరీ నోట్లు, ఆస్తి తనఖా పత్రాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేసును నీరుగార్చేందుకే తాను సెలవుపై వెళ్తున్నట్టు జరిగిన ప్రచారం అవాస్తవమని చెప్పిన సవాంగ్, తన పర్యటన రెండు నెలల క్రితమే ప్లాన్ చేసుకున్నదని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దాన్ని వాయిదా వేసుకున్నానని తెలిపారు.