: రూ.12.5 కోట్లు పలికినా, సురేశ్ రైనాకు దక్కేది మాత్రం రూ.9.5 కోట్లే!
టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనాను ఐపీఎల్ లో కొత్త జట్టు రాజ్ కోట్ అత్యధికంగా రూ.12.5 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. గతంలో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన ఈ చెన్నై ఆల్ రౌండర్, తాజాగా ఆ జట్టు రద్దు కావడంతో కొత్త జట్టు రాజ్ కోట్ కు ఆడనున్నాడు. ఇక అతడి ఫేవరెట్ ఆటగాడు ధోనీ ప్రత్యర్థి జట్టు పుణేకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దీంతో ధోనీకి ఎదురొడ్డి పోరాడాల్సిన కొత్త బాధ్యతలు భుజానికెత్తుకున్న రైనా, రాజ్ కోట్ కెప్టెన్ గానూ బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేకపోలేదు. ఇంతటి కీలక బాధ్యతలు చేపట్టనున్నందునే అతడికి రాజ్ కోట్ యాజమాన్యం రూ.12.5 కోట్లు వెచ్చించేందుకు వెనుకాడలేదు. అయితే బీసీసీఐ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే, రైనాకు దక్కేది మాత్రం రూ.9.5 కోట్లేనట. కొత్తగా బరిలోకి దిగుతున్న జట్టు తాను కొనుగోలు చేసిన ఆటగాళ్లకు పాత జట్లు చెల్లించిన సొమ్మునే ఇవ్వాలని బీసీసీఐ షరతు ఉంది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ లో రైనాకు రూ.9.5 కోట్లు దక్కాయి. దీని ప్రకారం తనకు పలికిన ధర కంటే రూ.3 కోట్లు తక్కువగా రైనా రూ.9.5 కోట్లతోనే సరిపెట్టుకోక తప్పేలా లేదు.