: అరెస్టులు...అజ్ఞాతవాసాలు: ఏపీవ్యాప్తంగా ‘కాల్ మనీ’పై దాడులు!
నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో వెలుగుచూసిన కాల్ మనీ దందా ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ కోరలు చాచినట్లు పోలీసుల దాడులు తేల్చిచెబుతున్నాయి. వారం రోజులుగా ఈ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి అత్యావసరాలే ఆసరాగా అధిక వడ్డీలకు అప్పులిచ్చేసిన కాల్ మనీ వ్యాపారులు, ఆ తర్వాత వసూళ్లలో వికృతరూపం ప్రదర్శించారు. రుణ గ్రహీతల్లోని మహిళలపై అత్యాచారాలకు, వారిని వ్యభిచార కూపంలోకి నెట్టేందుకు వెనుకాడలేదు. ఈ క్రమంలో విజయవాడ పోలీసులకు అందిన సింగిల్ ఫిర్యాదు, రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వెల్లువెత్తేలా చేసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పోలీసులు ముమ్మర దాడులకు శ్రీకారం చుట్టారు. పోలీసుల దాడులతో భీతిల్లిన కాల్ మనీ వ్యాపారులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. ఇక విజయవాడలో మొదలైన కాల్ మనీ అరెస్టులు రాష్ట్రవ్యాప్తమయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కాల్ మనీ వ్యాపారంపై చర్చలు సాగుతున్నాయి. దాదాపు అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది కూడా వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడుల్లోనే మునిగిపోయారు.