: కేజ్రీ సెక్రటరీపై సీబీఐ దాడుల నేపథ్యమేంటంటే... !
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ పై సీబీఐ సోదాలు నిన్న దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అవినీతిని అంతం చేస్తానంటూ సర్కారీ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించిన అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో సోదాలు జరిగిన వైనం యావత్తు దేశాన్నే షాక్ కు గురి చేసింది. అయినా నిన్నటి సీబీఐ సోదాల వెనుక అసలు కారణాలు వింటే ఇదేమీ అంత పెద్ద విషయం కాదని చెప్పొచ్చు. అసలు కేజ్రీవాల్ సర్కారుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం కూడా లేదని తెలుస్తోంది. అసలు కారణం విషయానికొస్తే... ఐటీ పరికరాల కొనుగోలు కోసం రాజేంద్రకుమార్ ఓ కంపెనీకే కాంట్రాక్టులు అప్పగిస్తూ ఆ కంపెనీకి ఆయాచిత లబ్ధి చేకూరుస్తున్నారని సీనియర్ అధికారి ఆశిష్ జోషి ఢిల్లీ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఐఏఎస్ ఆఫీసర్ కావడంతో ఏసీబీ చీఫ్ దానిని సీబీఐకి బదలాయించారు. దీంతోనే రాజేంద్రకుమార్ పనిచేస్తున్న కేజ్రీ కార్యాలయంపై సీబీఐ దాడులు చేసింది. గతంలో ఢిల్లీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన కొంతమంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సొంతంగా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారు. వారికి రాజేంద్ర కుమార్ పూర్తిగా సహకరించారు. 2007-2014 మధ్య కాలంలో ఐదు కాంట్రాక్టులు దక్కించుకున్న ఈ కంపెనీ ఢిల్లీ సర్కారు నుంచి రూ.9.5 కోట్లు కొల్లగొట్టేసింది. ఈ వ్యవహారంలో రాజేంద్రకుమార్ నిబంధనలను తోసిరాజని ఈ కంపెనీకి సహకరించారని, సర్కారీ సొమ్మును ఆ కంపెనీకి దోచిపెట్టారని ఆశిష్ జోషి తన ఫిర్యాదులో ఆరోపించారు. అంటే, కేజ్రీ సీఎం కాకముందు జరిగిన వ్యవహారానికి సంబంధించి ఆయన సీఎం అయిన తర్వాత సీబీఐ సోదాలు చేసింది. ఇక ఈ సోదాల్లో రాజేంద్ర కుమార్ వద్ద రూ.3 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీ కూడా పట్టుబడిందట.