: ఇక ఐఎస్ కి మూడినట్టే...34 ముస్లిం దేశాలు జత కలిశాయి
ఐఎస్ఐఎస్ కథ కంచికి చేరనుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదం కారణంగా ప్రపంచ దేశాల్లోని ముస్లింలపై అనుమానపు చూపులు పెరిగిపోతున్నాయి. ముస్లింలపై కొన్ని దేశాలు నిషేధం విధించే దిశగా పావులు కదుపుతున్నాయి. దీంతో మేల్కొన్న ఇస్లాం దేశాలు ఐఎస్ఐఎస్ పై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. 34 ముస్లిం దేశాలు కలిపి సంకీర్ణ సేనలను తయారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా నేతృత్వంలో రియాద్ కేంద్రంగా సంకీర్ణ సేనలు ఐఎస్ పై విరుచుకుపడనున్నాయి. ఈ దేశాల జాబితాలో ఈజిప్ట్, ఖతార్, యూఏఈ, టర్కీ, మలేషియా, పాకిస్థాన్, గల్ఫ్ అరబ్, ఆఫ్రికన్ అరబ్ దేశాలున్నాయి. ఇస్లామిక్ దేశాలను ఉగ్రవాదం నుంచి రక్షించుకోవడం తమ విధి అని ఈ దేశాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని అంతం చేయడం తమ విధి అని ఈ దేశాలు తెలిపాయి. ఐఎస్ఐఎస్ పై చర్యలు తీసుకునే సమయంలో అంతర్జాతీయ సమాజంతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం వుందని వారు పేర్కొన్నారు. ఏకపక్షంగా ఎటువంటి చర్య తీసుకోలేమని సౌదీ అరేబియా తెలిపింది.