: అనిరుధ్, శింబు, ధనుష్ లది ఇదే తీరు: మహిళా సంఘాలు
తమిళ సినీ సంగీత దర్శకుడు అనిరుధ్, నటులు శింబు, ధనుష్ లకు మహిళలపై గౌరవం లేదని మహిళా సంఘాలు ఆరోపించాయి. బీప్ సాంగ్ పై మాట్లాడుతూ, అనిరుధ్, శింబు, ధనుష్ లు మొదటి నుంచి మహిళలను కించపరిచే గీతాలు పాడుతున్నారని మండిపడ్డారు. ధనుష్ తన సినిమాలో 'కొట్టండి రా, దాన్ని తొక్కండిరా' అంటూ పాటపాడాడని, అప్పుడే ఆందోళన చేసుంటే మరోనటుడు ఈ ప్రయత్నం చేసి ఉండేవాడు కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీప్ సాంగ్ ఉదంతంలో భాగమైన వారంతా అరెస్టు కావాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయస్థానం మెట్లెక్కేందుకు కూడా వెనుకాడమని వారు స్పష్టం చేశారు. వరదల బారినపడి నీట మునిగిన చెన్నై వాసులను ఆదుకునే పనిలో విశాల్, కార్తీ తదితర నటులు బిజీగా గడిపితే, శింబు మహిళలను కించపరిచేలా బీప్ సాంగ్ తీయడంలో నిమగ్నమయ్యాడని అతని ఇంటి ముట్టడికి ప్రయత్నించిన ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. కాగా, శింబు పరారీలో ఉండగా, అనిరుధ్ సంగీత ప్రదర్శనకు అమెరికా వెళ్లడం విశేషం.