: తాగునీటికీ కరువాయే!... హైదరాబాద్ యూనివర్శిటీలో విద్యార్థుల అవస్థ!


హైదరాబాద్ నగరంలోని చాలా కాలనీల్లో మంచినీటి సమస్య తాండవిస్తోంది. రిజర్వాయర్లలో జలాలు అడుగంటిన కారణంగా కొన్నిరోజులుగా మంచినీటి సరఫరా లేదు. ఈ జాబితాలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ (యుఓహెచ్) కూడా ఉంది. సుమారు రెండు వారాలకు పైగా ఇక్కడ తీవ్ర మంచినీటి సమస్య నెలకొని ఉంది. దీంతో ఇక్కడి విద్యార్థులు, వర్శిటీ సిబ్బంది బయట నుంచి మంచినీటిని కొనుగోలు చేసుకునే పరిస్థితి నెలకొంది. మంజీరా, సింగూర్ బ్యారేజ్ నుంచి వచ్చే మంచినీరు ఈ యూనివర్శిటీకి సరఫరా అవుతూ ఉంటుంది. ప్రస్తుతం మంచినీటి సరఫరా లేకపోవడంతో మంచినీటి ట్యాంకర్లును వర్శిటీ అధికారులు తెప్పిస్తున్నారు. గత ముప్ఫై సంవత్సరాలలో మంజీరా రిజర్వాయర్ ఎండిపోవడం ఇదే ప్రథమం. యూనివర్శిటీలో మొత్తం 16 హాస్టళ్లు ఉన్నాయి. మెయిన్ క్యాంపస్ లోని ఏ, బీ, సీ, డీ, ఎన్ఆర్ఎస్, ఎన్ఆర్ఎస్ అనెక్స్, హెచ్, లేడీస్ హాస్టళ్లలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ హాస్టళ్లలో రీసెర్చి స్కాలర్లు ఎక్కువగా ఉన్నారు. యూనివర్శిటీలో రెండు బోర్ వెల్ లు ఉన్నాయి. కానీ, వాటి ద్వారా సరిపడా నీరు రాకపోవడం, హాస్టళ్లలో ఉన్న పంపులు లీకవుతుండటం కూడా ఇక్కడి మంచినీటి సమస్యకు మరో కారణంగా చెప్పవచ్చు. మంచినీటి సమస్య నేపథ్యంలో యూనివర్శిటీలో ఇటీవల బోర్ వెల్స్ వేశారు. అదృష్టవశాత్తు, ఆ రెండు బోర్లలో నీరు పడింది. ‘మంచినీటి కొరత తీవ్రంగా ఉన్న కారణంగా చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని, మంజీరా నీరు రావడం లేదని, ఈ సమస్యను అధిగమించేందుకుగాను బోర్ వెల్స్ వేస్తున్నాము’ అంటూ వర్శిటీ అధికారులు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వర్శిటీ హాస్టళ్లలో మంచి నీటి కుళాయిలను ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య సమయంలో మాత్రమే వినియోగించుకునేలా నిబంధన పెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, నీటి కొరత కారణంగా స్నానం చేసేందుకు కూడా ఇబ్బంది ఉందని, ఫ్రెండ్స్ ఇళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మరో సెమిస్టర్ ప్రారంభం కానుందని, వర్శిటీ అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని వర్శీటీ విద్యార్థులు, కొంతమంది ప్రొఫెసర్లు పేర్కొన్నారు. కాగా, మరికొంత మంది వర్శిటీ విద్యార్థులు ఈ సమస్యపై సామాజిక మీడియాలో కామెంట్లు పెట్టారు.

  • Loading...

More Telugu News