: ‘అయుత చండీయాగం’ విశేషాలు...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలలో అయుత చండీయాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో యాగశాలల నిర్మాణం, రుత్విక్కులకు బస, ఆహ్వానితులకు, ముఖ్యమైన అతిథులకు అవసరమైన అన్ని ఏర్పాట్లకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి 27 వరకు ఐదురోజుల పాటు నిర్వహించనున్న ఈ యాగాన్ని హైదరాబాద్ కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రవెల్లి గ్రామంలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిర్వహించనున్నారు. కాగా, యాగ కార్యక్రమాలను, రుత్విక్కులతో సమన్వయం వంటి అంశాలను చూసుకునేందుకు అష్టకళా రామ్మోహన్ శర్మను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ యాగ నిర్వహణకు సంబంధించిన ఆసక్తికర అంశాల విషయానికొస్తే... * 30 ఎకరాల స్థలంలో యాగం ఏర్పాట్లు * 40,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్రదేశంలో ప్రధాన యాగశాల నిర్మాణానికి వెదురు బొంగులు, వరి గడ్డి వినియోగం * 106 హోమ గుండాల నిర్మాణం * ఐదు రాష్ట్రాల నుంచి సుమారు 1,500 రుత్విక్కులు.. వారి సహాయకులు 500 మంది * యాగశాల, భోజనశాలల ఆహ్వాన ద్వారాలను ప్రత్యేక రీతిలో అలంకరించేందుకు ఆర్ట్ డైరైక్టర్ రమేష్ * ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నుంచి 150 మంది వంటవాళ్లు * విజిటర్లు, సాధారణ ప్రజల కోసం రోజుకు సుమారు 50,000 భోజనాల ఏర్పాటు * భోజనశాలలో ఒకేసారి 10,000 మంది భోజనం చేసేలా ఏర్పాట్లు * సందర్శకులందరికీ ప్రసాదం * వివిధ పీఠాలు, మఠాల నుంచి వచ్చే పీఠాధిపతులు, వీవీఐపీల కోసం ప్రత్యేక కాటేజీలు * రుత్విక్కుల కోసం ప్రత్యేక వసతి సదుపాయం * ఫార్మ్ హౌస్ కు ముందున్న ప్రదేశంలో హెలీ ప్యాడ్ * ఈ యాగానికి హాజరుకాబోయే ఆహ్వానితులు సాంప్రదాయక దుస్తులు ధరించనున్నారు.