: పోలీస్ కమీషనర్ ను సెలవుపై పంపాల్సిన అవసరం ఏంటి?: అంబటి
కాల్ మనీ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళుతున్నారంటూ వార్తలు వస్తుండటంపై ప్రభుత్వంపై వైసీపీ మండిపడింది. అసలిప్పుడు ఆయనను సెలవుపై పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. దానికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాయతీగా పనిచేసిన ఎస్పీలను గతంలో కూడా బదిలీ చేశారని ప్రస్తావించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం కాల్ మనీ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ కేసులో నిందితులను రక్షించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, వారిని కాపాడటం కోసమే ముక్కుసూటిగా పనిచేసే సవాంగ్ ను సెలవుపై పంపిస్తున్నారని ధ్వజమెత్తారు.