: ఇతడే జీసస్... టోమోగ్రఫీ విధానంలో తయారైన రూపం ఇదే!
దేవుని పుత్రుడిగా పశ్చిమ దేశాలు విశ్వసించే ఏసుక్రీస్తు ఎలా ఉంటాడు? ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొన్నామని ఫోరెన్సిక్ నిపుణులు ప్రకటించారు. ఒకటవ శతాబ్దానికి చెందిన జ్యూయిష్ పురుషుల పుర్రెలను సేకరించి, వాటిని విశ్లేషించి ఓ చిత్రాన్ని నిపుణులు రూపొందించారు. ఏసుక్రీస్తు ఇలానే ఉంటాడని నమూనాను తయారు చేసిన మాంచెస్టర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ రిచర్డ్ నివాయే ప్రకటించారు. ఉత్తర ఇజ్రాయిల్ లోని గెలిలీ ప్రాంతం నుంచి తాము ఈ పుర్రెలను సేకరించినట్టు తెలిపారు. కాగా, అందుబాటులోని వివిధ వర్ణనల ప్రకారం, క్రీస్తు తెల్లగా, పొడవుగా ఉంటాడని, గడ్డం పెంచుకోడని, స్ఫురధ్రూపని తెలుస్తుండగా, ఈ చిత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. రిచర్డ్ తయారు చేసిన చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్. ఓ నిపుణుడైన మెడికల్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న రిచర్డ్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ విధానంలో జీసస్ బొమ్మను తయారు చేసినట్టు చెబుతున్నారు. ముఖం, కండరాలు తదితరాలను ఎక్స్-రే స్లైసెస్ పద్ధతిలో రూపొందించామని తెలిపారు.