: నల్లగా ఉందంటూ, గర్భవతికి విడాకులిస్తానంటున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్
నలుపు రంగులో ఉందన్న వంకతో... గర్భవతైన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యాడో సాఫ్ట్ వేర్ ప్రబుద్ధుడు. తనకు విడాకులు కావాలంటూ భార్యకు ఈ-మెయిల్ పంపాడు. ఒళ్లు మండిపోయిన ఆమె... పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే, జంషెడ్ పూర్ కు చెందిన యువతి (26) నోయిడాలోని ఓ ఫార్మా కంపెనీలో రీసర్చ్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ (35)తో ఆమెకు పెళ్లయింది. పెళ్లయిన తొలి నాళ్లలోనే నల్లగా ఉన్నావంటూ భార్యను కించ పరిచేవాడు. ఈ క్రమంలో, తాను గర్భవతిని అనే విషయాన్ని ఈ నెల 5న భర్తకు తెలిపింది. నాలుగు రోజుల అనంతరం, ఇకపై తాను కాపురం చేయలేనని, తనకు విడాకులు కావాలని కోరుతూ భార్యకు ఈమెయిల్ పంపించాడు భర్త. దీంతో, తనకు న్యాయం చేయాలని ఈ రోజు ఆమె పోలీసులను ఆశ్రయించింది. తొలుత ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా తన ఫిర్యాదును తిరస్కరించారని... దీంతో, ఇంకో పోలీస్ స్టేషన్ కు వచ్చానని బాధితురాలు తెలిపింది. పెళ్లికి ముందే తనను తన భర్త కుటుంబీకులు చూశారని... తాను నచ్చకపోతే అప్పుడే చెప్పి ఉంటే పోయేదని ఆవేదన వ్యక్తం చేసింది. జంషెడ్ పూర్ లో పెళ్లి జరిగిన తర్వాత అక్టోబర్ వరకు బెంగళూరులో భర్త వద్ద ఉన్న ఆమె... నవంబర్ లో మళ్లీ ఉద్యోగంలో చేరింది. తాను గర్భవతినని తెలిసిన తర్వాత తన భర్త తనను మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. అయితే, తన భార్యకు ఆరోగ్య సమస్యలున్నాయని... వాటిని కప్పిపెట్టి తనతో వివాహం జరిపించారని... అందుకే తాను విడాకులు అడుగుతున్నానని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చెబుతున్నాడు. అయితే, తన కూతురుకు కేవలం డస్ట్ అలర్జీ మాత్రమే ఉందని... ఎలాంటి అనారోగ్యాలు లేవని బాధితురాలి తల్లిదండ్రులు వాపోతున్నారు. పోలీసులు తన కూతురుకి న్యాయం చేయాలని కోరుతున్నారు.