: నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో అమితాబ్ బచ్చన్... లక్ష షేర్లు ఆయనవే!
దేశంలో రాజకీయ ప్రకంపనలు పుట్టించిన నేషనల్ హెరాల్డ్ కేసుకు, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు సంబంధముందా? అంటే, అవుననే సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ యాజమాన్య సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ లో అమితాబ్ కు లక్ష ఈక్విటీ వాటాలున్నాయని తెలుస్తోంది. ఆయన నిర్వహిస్తున్న అభిమ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఈ వాటాలు ఉన్నట్టు ఓ టెలివిజన్ చానల్ విచారణలో బయటపడింది. అభిమ్ సంస్థ అడ్రస్, ప్రతీక్ష, ప్లాట్ నంబర్ 14, 10వ రోడ్డ, జుహూ, ముంబై పేరిట రిజిస్టర్ కాగా, ప్రస్తుతం అమితాబ్ నివసిస్తున్నది ఇక్కడే. 'ప్రతీక్ష' ఆయన తన ఇంటికి పెట్టుకున్న పేరని అందరికీ తెలిసిందే. వాజిర్ చిత్రం ప్రమోషన్ గురించి అమితాబ్ మీడియా ముందుకు వచ్చిన వేళ, ఇదే విషయాన్ని అమితాబ్ ముందుంచి, అభిమ్ ఇన్వెస్ట్ మెంట్ గురించి ప్రశ్నిస్తే, ఆయన సమాధానం ఇవ్వలేదు. కాగా, గతంలో గాంధీల కుటుంబానికి అమితాబ్ చాలా దగ్గరగా మెలిగారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏజేఎల్ లో వాటాదారులంతా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలతో సన్నిహితంగా ఉన్న వారే. ఏజేఎల్ లో వాటాదారులుగా ఉన్న ఎందరో సంస్థ లావాదేవీలపై తమకు సమాచారం లేదని ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. ఈ సంస్థకు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అప్పనంగా మింగారని సోనియా, రాహుల్ లపై అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక కేసులో అమితాబ్ కూడా ఉన్నారని వస్తున్న వార్తలు కొత్త చర్చలకు తెరలేపవచ్చు.