: ప్రతి వివాదంలోను మోదీ పేరేనా?: వెంకయ్యనాయుడు
ఢిల్లీ సచివాలయంలో సీబీఐ దాడులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ విషయంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన, ప్రతి వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరును లాగడం ఆయనకు అలవాటైపోయిందని విమర్శించారు. కేంద్రంతో కయ్యం ఢిల్లీ సీఎంకు పరిపాటిగా మారిందని అన్నారు. సీబీఐ ఓ స్వతంత్ర సంస్థ అని, దాని అజమాయిషీ ప్రభుత్వ కనుసన్నల్లో ఉండదన్న విషయం కూడా కేజ్రీకి తెలియకపోవడం దురదృష్టకరమని అన్నారు. కేజ్రీవాల్ చీఫ్ సెక్రటరీ ఆఫీసులో మాత్రమే తనిఖీలు జరిగాయని తనకు తెలిసిందని వివరించారు. కాగా, సీబీఐ సోదాలపై ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ఆప్ ప్రకటించింది. మరోవైపు సీబీఐ సైతం తాము కేజ్రీవాల్ కార్యాలయం జోలికి వెళ్లలేదని చెబుతుంటే, కేజ్రీవాల్ మాత్రం తన ఆఫీసులోనే సెర్చింగ్ జరుగుతోందని చెబుతున్నారు.