: కరెన్సీపై రాతలున్నా చెల్లుతాయి: స్పష్టం చేసిన ఆర్బీఐ
జనవరి 1 నుంచి కరెన్సీ నోట్లపై రాతలుంటే చెల్లవని జరుగుతున్న ప్రచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖండించింది. "నాకు తెలిసినంతవరకూ, వాట్స్ యాప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా, వచ్చే యేడాది నుంచి రాతలున్న నోట్లు చెల్లవని ప్రచారం జరుగుతోంది. ఇది తప్పు. అటువంటి నోట్లను మేము నిషేధించడం లేదు. అవన్నీ చెల్లుబాటవుతాయి" అని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వెల్లడించారు. "వికారంగా కనిపించే నోట్లను చెలామణి నుంచి తొలగించి, కొత్త వాటిని చేర్చాలన్నది ఆర్బీఐ విధానం. అంతమాత్రాన ఆ నోట్లు చెల్లవని కాదు. వాటిని ఎక్కడైనా, ఎవరైనా వాడుకోవచ్చు. తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి" అని రాజన్ అన్నారు. వచ్చే సంవత్సరం నుంచి నోట్లపై రాతలుంటే అవి చెల్లవని, బ్యాంకులు కూడా స్వీకరించవని ఓ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.