: ఢిల్లీ సచివాలయంలో సీబీఐ సోదాలు... కేజ్రీవాల్ కార్యాలయం సీజ్!
దేశ రాజధానిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ ఉదయం నుంచి సీబీఐ జరుపుతున్న సోదాలు కలకలం పుట్టిస్తున్నాయి. ఎందుకోసమో చెప్పకుండా సీబీఐ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయం, ఇతర మంత్రుల చాంబర్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సచివాలయంలో తనిఖీలు జరుగుతున్న విషయాన్ని ధ్రువీకరించిన కేజ్రీవాల్, రాజకీయంగా తనకు ఎదురునిలిచే సత్తా లేకనే మోదీ ఈ తరహా దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంపై సీబీఐ దాడులు రాజకీయ కుట్రేనని వ్యాఖ్యానించారు. కాగా, కేజ్రీవాల్ కార్యాలయాన్ని సీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సీబీఐ ఆ దరిదాపులకు కూడా ఎవరినీ రానివ్వడం లేదు. మరోవైపు చీఫ్ సెక్రటరీ ఆఫీసును కూడా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దాడుల విషయమై మరింత సమాచారం వెలువడాల్సివుంది.