: 'హెచ్-1బీ'లు తగ్గిస్తే అమెరికాకే ఇబ్బంది: నాస్ కామ్
అమెరికాలో నిపుణులైన ఉద్యోగులు లభించనందునే హెచ్-1బీ వీసాలపై విదేశీ ఉద్యోగులను సంస్థలు తీసుకువెళ్తున్నాయని, ఈ వీసాలను తగ్గిస్తే, నష్టం అమెరికాపైనే అధికమని నాస్ కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) అభిప్రాయపడింది. హెచ్-1బీ వీసాల్లో కోత విధించాలని ఇద్దరు సెనెటర్లు ప్రవేశపెట్టిన బిల్లుపై ఎటువంటి ఆందోళనా అక్కర్లేదని నాస్ కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఎన్నికల ముందు ప్రజలను ఆకట్టుకునేందుకు తెరపైకి తెచ్చిన అంశమేనని అన్నారు. అమెరికాలో కార్యాలయాలు నిర్వహిస్తున్న భారత కంపెనీలు, అక్కడి వారికే జాబ్ లిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, సరైన నైపుణ్యమున్నవారు లభించడం లేదని ఆయన అన్నారు. ఎన్నికల వేళ, వీసాలను 15 వేలకు కుదించాలన్న నిర్ణయం అమలైతే యూఎస్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. భారత టెక్ కంపెనీలు అమెరికాలో 4 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు. 2010 నుంచి ఇప్పటివరకూ యూఎస్ సర్కారుకు భారత కంపెనీలు రూ. 2,250 కోట్ల పన్నులను చెల్లించాయని, ఎన్నో సామాజిక బాధ్యతా కార్యక్రమాలు నిర్వహించాయని గుర్తు చేశారు.