: కాల్ మనీ కల్లోలం... ఏపీ వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లపై సోదాలు


నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో వెలుగుచూసిన కాల్ మనీ వ్యవహారం కలకలం రేపింది. అధిక వడ్డీలకు అప్పులిచ్చిన వడ్డీ వ్యాపారులు రుణ గ్రహీతలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతేకాక ఆయా కుటుంబాల్లోని మహిళలను వ్యభిచార కూపంలోకి లాగేశారు. ఈ వ్యవహారం వెలుగుచూసిన వెంటనే రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఏపీలో అధికార పార్టీ టీడీపీకి చెందిన పలువురు నేతలకు ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ కాల్ మనీ తరహా దందాపై ఉక్కుపాదం మోపాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో విజయవాడ కాల్ మనీ వ్యవహారంపై కేసులు నమోదు చేసిన పోలీసులు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాల్ మనీ తరహాలో తమకూ ఇబ్బందులు ఎదురయ్యాయని ఉభయగోదావరి జిల్లాల నుంచి కూడా విజయవాడ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారంపై నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీసులు వడ్డీ వ్యాపారంపై దృష్టి సారించారు. సినిమా నిర్మాణానికి పెద్ద ఎత్తున ఫైనాన్స్ చేస్తారని పేరున్న కడప జిల్లా ప్రొద్దుటూరు వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. పట్టణంలోని వడ్డీ వ్యాపారుల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు చేసిన పోలీసులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రొద్దుటూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతున్న పట్టణాల్లో ముమ్మర సోదాలు జరుగుతున్నాయి. ఊహించని దాడులతో వడ్డీ వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు.

  • Loading...

More Telugu News