: ఈ సినిమా చూసిన ప్రతి భారతీయుడూ గర్విస్తాడు: అక్షయ్ కుమార్
'ఎయిర్ లిఫ్ట్' సినిమా చూసిన ప్రతి భారతీయుడు గర్విస్తాడని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తెలిపాడు. ఎన్ఎంఐఎంఎస్ కాలేజీ ఎయిర్ ఫెస్టివల్ లో ఆయన మాట్లాడుతూ, దీనిని పాఠ్యపుస్తకాలలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరానని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద శరణార్థుల తరలింపు ఇదేనని ఆయన పేర్కొన్నారు. 1990లో కువైట్ పై ఇరాక్ నియంత సద్ధాం హుస్సేన్ విరుచుకుపడి ఆక్రమించుకున్నప్పుడు అక్కడ చిక్కుకుపోయిన 1.70 లక్షల మంది భారతీయులను వీరోచితంగా వైమానిక దళం తరలించిందని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలో ఇదే అతిపెద్ద తరలింపు అని ఆయన పేర్కొన్నారు. ఇది గిన్నిస్ బుక్ లో కూడా చేరిందని ఆయన పేర్కొన్నారు. షాజహాన్, అక్బర్ వంటి వారి గురించి మనం చదివాం, ఇలాంటి ఘటనల గురించి కూడా భవిష్యత్ తరాలు చదువుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇలాంటి ఘటనలు మరుగున ఉంచడం వెనుక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. లక్షా 70 వేల మంది భారతీయ శరణార్థులను 488 విమానాల్లో 59 రోజుల పాటు ఎలా తరలించారు అనేది 'ఎయిర్ లిఫ్ట్' సినిమాలో చూపిస్తున్నామని ఆయన తెలిపారు.