: స్వీట్లపై ఉండే ‘సిల్వర్’తో జాగ్రత్త!


స్వీటు లేకుండా ఏ శుభకార్యం జరగదు. ఇంట్లో చేసుకునే స్వీట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ, బయటి స్వీట్ షాపుల్లో కొనుగోలు చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా, స్వీట్లపై సిల్వర్ ను తాపడం చేసేందుకు పలుచటి వెండి షీట్లను వినియోగిస్తుంటారు. నాణ్యమైన స్వీట్లను అందించే దుకాణాలు ఈ విషయంలో నిజాయతీగానే వ్యవహరిస్తుంటాయి. కానీ, చిన్నచిన్న స్వీట్ షాపులు, బండ్లపై వ్యాపారం నిర్వహించే వారు మాత్రం సిల్వర్ షీట్ కు బదులుగా అల్యూమినియం షీట్ ను ఉపయోగిస్తుంటారు. సిల్వర్ షీటు ధరతో పోలిస్తే అల్యూమినియం షీటు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో అల్యూమినియం షీటును కొనుగోలు చేసి స్వీట్లపై తాపడం చేస్తున్నారు. ఈ మార్పును వినియోగదారులు గుర్తించలేరు. స్వీట్లపై ఉన్నది సిల్వరే అనుకుని కొనుగోలు చేస్తే ఫుడ్ పాయిజన్ కు గురవక తప్పదు. తీవ్రమైన కడుపునొప్పితో అనారోగ్యం పాలవక తప్పదని జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారి జి. వినోద్ దయాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ, న్యూఇయర్ వేడుకలు రానుండటంతో స్వీట్ షాపుల్లో రకరకాల స్వీట్లను తయారు చేస్తున్నారని, ఇందులో స్వీట్లపై సిల్వర్ ఉండేవి కూడా ఉన్నాయని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్వీట్ పై తాపింది సిల్వరా? లేక అల్యూమినియమా? అన్నది తెలుసుకునేందుకు.. ఆయా స్వీట్లపై ఉండే సిల్వర్ చేతికి అంటకపోతే అది ఒరిజినల్ అని అన్నారు. ఒకవేళ చేతికి అంటితే కనుక అది సిల్వర్ కాదు అల్యూమినియం అని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఇటువంటి స్వీట్లు కొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు.

  • Loading...

More Telugu News