: రాహుల్ గాంధీ ఇంకా చిన్నపిల్లాడే!: కేజ్రీవాల్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చిన్నపిల్లాడంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కామెంట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో "రాహుల్ ఇంకా చిన్నపిల్లాడే. అతడికి కనీసం రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వం కిందకు వస్తుందనే అంశం కూడా పార్టీ వారు నేర్పించినట్టు లేదు" అని కేజ్రీ ట్వీట్ చేశారు. పశ్చిమ ఢిల్లీలోని షాకూర్ బస్తీలో ఇవాళ రాహుల్ పర్యటించారు. అక్కడ మురికివాడల్లోని దాదాపు 1200 అక్రమ గుడిసెలను కేంద్రం తొలగించిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జరిగిన నష్టానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అంతేగాక బస్తీ ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించాలని ఆప్ డిమాండ్ చేయడాన్ని రాహుల్ తప్పుబట్టారు. అధికారంలో ఉన్న ఆప్ ధర్నా చేయడం, ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీ రాహుల్ పై ఈవిధంగా స్పందించారు.