: కేరళ ప్రభుత్వంతో మాకెలాంటి ఘర్షణ లేదు: లోక్ సభలో రాజ్ నాథ్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ నేత ఆర్.శంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమానికి కేరళ సీఎం ఉమెన్ చాందీ దూరంగా ఉండటంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. ఈ మేరకు లోక్ సభలో ఈ విషయానికి సంబంధించి ఓ ప్రకటన చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చాందీ రాకుండా అడ్డుకునే ఉద్దేశం కేంద్రానికి లేదని రాజ్ నాథ్ చెప్పారు. ఆయనను మోదీ అవమానించారని రాహుల్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అంతేగాక కేరళ ప్రభుత్వంతో తమకు ఎటువంటి ఘర్షణ కూడా లేదని తెలిపారు. సీఎం రావొద్దని ప్రధాని ఎప్పుడూ సూచించలేదని, ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న సంస్థే చాందీ రాకను అడ్డుకుందని వివరించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ నారాయణ ధర్మ పరిపాలన సంస్థ ఆ రాష్ట్ర సీఎంకు ఆహ్వానం కూడా పంపలేదని హోంమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అందరి సహకారం కోరుతోందని పేర్కొన్నారు.