: తప్పుడు పనులు చేస్తే తాట తీస్తాం: చంద్రబాబు హెచ్చరిక
కాల్ మనీ, కల్తీమద్యం తదితర వ్యవహారాల్లో ఎంతటివారున్నా విడిచిపెట్టే సమస్యే లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కలెక్టర్ల సదస్సును ప్రారంభించిన ఆయన, కాల్ మనీ వ్యవహారంపై స్పందించారు. ఈ కేసుల్లో నిందితులు ఎవరైనా చట్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరించారు. తప్పుచేసిన తనవాడైనా, ఎదుటివాడైనా కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించిన చంద్రబాబు, ఈ తరహా చర్యలు నవ్యాంధ్ర నూతన రాజధాని ఇమేజ్ ను దెబ్బతీస్తాయని అన్నారు. ఈ తరహా చర్యలను ప్రాథమిక దశలోనే అణచి వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాల్ మనీ బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎవరూ ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని అభయమిచ్చిన చంద్రబాబు, ఎవరైనా ఆగడాలకు పాల్పడితే తాట తీస్తామని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. వేధింపులు తక్షణం ఆపకుంటే నిర్భయ చట్టాన్ని ప్రయోగిస్తామని, తప్పుడు పనులు చేసేవారు భయపడేలా ఏపీ ప్రభుత్వం చర్యలుంటాయని వివరించారు.