: మనీ గేమ్... డబ్బులున్న ఐపీఎల్ లో కొత్త ఫ్రాంచైజీలకు భారీ నష్టాలే!


మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై సస్పెండయిన ఐపీఎల్ టీమ్ లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ స్థానంలో రివర్స్ బిడ్డింగ్ విధానంలో ఎంపికైన కొత్త ఫ్రాంచైజీలకు ఆదిలోనే భారీ నష్టాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. గత వారంలో రాజ్ కోట్, పుణె నగరాల కొత్త ఫ్రాంచైజీలను దక్కించుకున్న ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటెక్స్ సంస్థ, కోల్ కతా వ్యాపారి సంజీవ్ గోయంకాలు వచ్చే రెండేళ్లలో రూ. 100 కోట్ల నుంచి రూ. 120 కోట్ల వరకూ నష్టపోనున్నారని నిపుణులు లెక్కగడుతున్నారు. ఇక ఈ రెండు టీమ్ ల సంయుక్త నష్టం రూ. 240 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎలాగంటే... ఏదైనా ఐపీఎల్ టీం వార్షిక ఖర్చు రూ. 95 కోట్ల నుంచి రూ. 100 కోట్లను మించరాదు. ఇక వారికి వచ్చే ఆదాయాన్ని లెక్కిస్తే... స్పాన్సర్ షిప్ లు రూ. 22 కోట్లను మించరాదు. పుణెలో క్రీడాభిమానుల నుంచి టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం (7 మ్యాచ్ లకు స్టేడియం పూర్తిగా నిండితే రూ. 21 కోట్లు (పుణెలో), రూ. 16 కోట్లు (రాజ్ కోట్ లో) వస్తుంది. ఇక ఆహారం, శీతల పానీయాలు తదితరాల అమ్మకం ద్వారా మరో రూ. 50 లక్షల వరకూ ఆదాయం రావచ్చని అంచనా. మొత్తం ఆదాయం కలిపినా పుణె ఫ్రాంచైజీకి 43.5 కోట్లు, రాజ్ కోట్ ఫ్రాంచైజీకి రూ. 38.5 కోట్లను మించే అవకాశాలు కనిపించడం లేదు. దీనికితోడు ఐపీఎల్ సెంట్రల్ రెవెన్యూ నుంచి ఈ టీములకు ఒక్క రూపాయి కూడా దక్కదు. అంటే, ఈ ఫ్రాంచైజీల యాజమాన్యం ఒక్కో ఐపీఎల్ సీజనులో రూ. 50 కోట్ల నుంచి రూ. 55 కోట్ల వరకూ నష్టాన్ని భరించాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News