: బ్యాంకాక్ నుంచి బెజవాడ చేరుకున్న బోడె ప్రసాద్.. కాల్ మనీతో సంబంధం లేదని ప్రకటన
బెజవాడలో ప్రకంపనలు రేపుతున్న కాల్ మనీ వ్యాపారంలో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత, కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన విదేశీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని వచ్చారు. నిన్న రాత్రి బ్యాంకాక్ లో బయలుదేరిన ఆయన నేటి ఉదయం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ తెలుగు టీవీ చానెల్ తో ఆయన మాట్లాడుతూ కాల్ మనీ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు. కాల్ మనీ వ్యాపారంలో కీలక నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్ తో తనకు స్నేహం మాత్రమే ఉందని చెప్పిన ఆయన, వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కాల్ మనీ వ్యవహారం బయటకు రాగానే స్నేహితుడిగా శ్రీకాంత్ ను తాను మందలించానని బోడె తెలిపారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లానన్నారు. స్నేహితుడిగా శ్రీకాంత్ కూడా తన వెంట వచ్చాడన్నారు. కాల్ మనీ వ్యవహారం వెలుగుచూసిన నేపథ్యంలో తన మందలింపు తర్వాత అతడు వేరే దేశానికి వెళ్లిపోయాడని చెప్పారు. అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, వైసీపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన కోరారు.