: హైదరాబాద్ లో స్వచ్ఛమైన గాలి లభించేంది ఏడాదిలో మూడు రోజులే!


హైదరాబాద్ వాసులకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే భాగ్యం ఏడాదిలో కేవలం మూడు రోజులు మాత్రమేనట. ఇందుకు కారణం, మహానగరంలో పెరిగిపోతున్న కాలుష్యమేనని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ బోర్డు పేర్కొంది. మహానగరంలోని గాలిలో నాణ్యతా ప్రమాణాలను కేంద్ర కాలుష్య నివారణ బోర్డుతో కలిసి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ బోర్డు(టీఎస్బీసీబీ) పరిశీలించింది. ఇక్కడి గాలిలో దుమ్ము, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నిట్రిక్ ఆక్సైడ్, అమ్మోనియా వంటి కాలుష్యకారకాలు ప్రధానంగా ఉన్నాయి. ఉదయం పూట ఎక్కువ కాలుష్యం ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్ మొదలైన వ్యాయామాల నిమిత్తం ప్రజలు ఉదయం పూట బయటకు వస్తుంటారు. ఈ సమయంలోనే ఎక్కువ వాతావరణ కాలుష్యం నమోదైంది. కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబయి వంటి మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్ కొంత మేరకు నయమని అధికారులు చెప్పారు. హైదరాబాద్ సిటీలో అత్యంత కాలుష్యం ఉన్న ప్రాంతం పంజాగుట్ట అన్న విషయం కేంద్ర, తెలంగాణ కాలుష్య నివారణ బోర్డులు సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశీలనలో తేలింది. లెక్కప్రకారం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 60 ఉండాలి. కానీ, హైదరాబాద్ లోని పంజాగుట్ట, ప్యారడైజ్, కూకట్ పల్లి, చార్మినార్ వంటి ప్రాంతాల్లో ఈ సంఖ్య 140-150 గా ఉంది. ఇటువంటి పరిస్థితి చాలా ప్రమాదకరమని.. పీల్చుకునే గాలి పూర్తిగా కలుషితంగా ఉందనడానికి ఇదే నిదర్శనమని టీఎస్బీసీబీ పేర్కొంది. జులై, అక్టోబర్ నెలల మధ్య మాత్రమే నాణ్యమైన గాలిని హైదరాబాద్ వాసులు పీల్చుకోగల్గుతున్నారని, అందుకు కారణం వినాయక చవితి, దసరా వంటి మొదలైన ప్రభుత్వ సెలవులు రావడమేనని టీఎస్బీసీబీ అధికారి పేర్కొన్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో ముఖ్యంగా యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, జూ పార్క్ వంటి ప్రదేశాల్లో వాతావరణ కాలుష్యం చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఏడాది మొత్తంలో వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉండే రోజుల సంఖ్య విషయానికొస్తే.. అధిక కాలుష్యం ఉండే రోజులు - 254 అత్యధిక కాలుష్యం ఉండే రోజులు - 92 పూర్తిగా కాలుష్యం ఉండే రోజులు - 9 ఒక మోస్తరు కాలుష్యం ఉండే రోజులు - 8 కాలుష్య రహితంగా ఉండే రోజులు - 3 అని టీఎస్బీసీబీ పేర్కొంది.

  • Loading...

More Telugu News