: క్షణానికో మలుపు... 'కాల్ మనీ' నివేదిక కోరిన చంద్రబాబు
పేదల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి డబ్బిచ్చి నెలకు నూటికి రూ. 10 నుంచి రూ. 30 వరకూ వడ్డీ వసూలు చేస్తున్న 'కాల్ మనీ' రాబందుల కేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బాధితులమంటూ విజయవాడ టాస్క్ ఫోర్స్ స్టేషన్లకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ కేసులో తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని, కేసు వెనుక ఉన్న వారి పేర్లను తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించినట్టు సమాచారం. ఈ ఉదయం డబ్బు చెల్లించని వారిపైకి బౌన్సర్లను పంపుతామని కొందరు బెదిరించినట్టు వార్తలు రాగా, ఆ వెంటనే ఓ బాధితురాలు తన అనుభవాన్ని మీడియాకు వెల్లడించింది. ఇక పోలీసులు పలువురి ఇళ్లపై దాడులు చేసి బస్తాల కొద్దీ ప్రాంసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసులో నిందితులుగా ఉండి పారిపోయిన వారి కోసం వెతుకులాట మొదలు పెట్టిన పోలీసులు, వారిని ఏ క్షణానైనా అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. కేసులో ప్రధాన నిందితులైన యలమంచిలి రాము, భవానీ శంకర్ లు డబ్బులు సకాలంలో ఇవ్వని వారిని ఓ ఇంట్లో నిర్బంధించి హింసించారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కొందరు నేతల ప్రమేయం ఉన్నట్టు వార్తలు వస్తుండటంతో, కాల్ మనీ వ్యవహారం ఈ ఉదయం నుంచి రాజకీయ రంగు పులుముకుంది. కేసు వెనక తెలుగుదేశం నేతలు ఉన్నారని, వారిని ఏం చేస్తారని వైకాపా, కాంగ్రెస్ నేతలు పలువురు ప్రత్యక్ష విమర్శలకు దిగారు. కేసులో ఇంకా ఎవరి పేర్లు వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.