: చంద్రబాబు నిప్పు... మా అన్నను అరెస్ట్ చేసినా స్పందించను: బుద్ధా వెంకన్న
కాల్ మనీ వ్యవహారంలో ఏ తెలుగుదేశం నేత ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సహించబోరని, నిప్పులాంటి ఆయన, ఈ కేసులో ప్రమేయమున్న అందరిపైనా చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాల్ మనీ కేసులో తన అన్న బుద్ధా ప్రసాద్ పై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, అతనికి, తనకు సంబంధం లేదని, ఎంతో కాలంగా తాము విడిపోయి ఉంటున్నామని అన్నారు. ఆయన వ్యాపారాలకు, తనకు సంబంధం లేదని, ఆయన్ను అరెస్ట్ చేసినా తాను స్పందించనని తెలిపారు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధం లేదని, తనకు కాల్ మనీ వ్యవహారాల గురించి కూడా తెలియదని అన్నారు. కావాలనే తనపై బురద జల్లుతున్నారని, రాజకీయంగా ఎదుర్కొనే శక్తిలేని వారే ఈ పని చేస్తున్నారని విమర్శించారు. తన అన్నయ్యకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వుంటే అవి ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ విషయమై తాను ఓపెన్ గా హామీ ఇస్తున్నానని తెలిపారు. అవసరాలకు అప్పులిస్తున్న వారిలో అన్ని పార్టీలకూ చెందిన వారున్నారని, ఇందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు.