: చంద్రబాబూ, వారిని సస్పెండ్ చేస్తావా? చెయ్యవా?: 'ఈనాడు' పేపర్ చూపుతూ దేవినేని నెహ్రూ
కాల్ మనీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తక్షణం సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈనాడు దినపత్రికలో "నాయకులూ కామాంతకులే" అంటూ ప్రచురితమైన కథనాన్ని చూపుతూ, తెలుగుదేశం నేతలు ఈ దారుణం వెనకున్నారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు. ఇందులో ప్రమేయమున్న వారందరినీ నరికేయాల్సిందేనని అన్నారు. నరికేయడమంటే తన భాషను తప్పుగా అర్థం చేసుకోవద్దని, ఈ వ్యాపారాన్ని సమూలంగా నిర్మూలించాలన్నది తన అభిమతమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకుంటే తీవ్ర ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. తాను 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినా, ఎన్నడూ వారానికి ఓసారి విదేశాలకు వెళ్లలేదని, నేటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిందితులను వెంటేసుకుని టూర్ల మీద టూర్లు వెళుతున్నారని ఆరోపించారు.