: 8 నెలల్లో 75 శాతం పెరిగి, వరల్డ్ హయ్యస్ట్ రిటర్న్ ఇచ్చిన భారత టెక్ సంస్థ
లాభాలను పెంచుకోవడంలో ప్రపంచ ఐటీ కంపెనీలు ఇబ్బందులు పడుతున్న వేళ, నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న భారత టెక్ సంస్థ ఎన్ఐఐటీ టెక్నాలజీస్ ఏకంగా 75 శాతం లాభాలను అందించింది. ఆక్సెంచర్, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో తదితర దిగ్గజాలేవీ ఎన్ఐఐటీ అందించిన లాభాల దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఓ మిడ్ కాప్ సంస్థగా లిస్టింగ్ అవుతున్న ఎన్ఐఐటీ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 75 శాతం పెరిగింది. మార్చి 25వ తేదీ నాటి ముగింపు ధరతో పోలిస్తే, ఇప్పుడు ఎన్ఐఐటీ వాటా విలువ 74 శాతం పెరిగింది. ఇదే సమయంలో సంస్థ మార్కెట్ కాప్ సైతం రూ. 3,600 కోట్లకు చేరుకుంది. కాగా, ఇదే సమయంలో టీసీఎస్, తన ఇన్వెస్టర్లకు ఇచ్చిన రాబడి కేవలం 6.3 శాతం మాత్రమే. ఇకపై ప్రభుత్వ ప్రాజెక్టులను స్వీకరించరాదని సంస్థ తీసుకున్న ఒక్క నిర్ణయంతోనే ఇన్వెస్టర్లు ఎన్ఐఐటీ వాటాల కొనుగోలుకు ఎగబడేలా చేసిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. "స్టాక్ మార్కెట్లో మా సంస్థ ఈక్విటీ విలువ పరుగులు పెట్టడానికి చాలా కారణాలున్నాయి. పెద్ద పెద్ద ప్రభుత్వ కాంట్రాక్టుల మార్గం నుంచి బయటపడి, గ్లోబల్ మార్కెట్లలో, చిన్న కాంట్రాక్టులపై దృష్టిని సారించడం ఇందులో ఒకటి" అని ఎన్ఐఐటీ టెక్నాలజీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ ఠాకూర్ వెల్లడించారు. ఇకపై అధిక మార్జిన్లను ఇచ్చే డిజిటల్ విభాగంపై దృష్టిని సారించామని అన్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ మార్జిన్లు 270 బేసిస్ పాయింట్ల వరకూ పెరగవచ్చని ఐడీఎఫ్సీ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది.