: హెచ్ఐవీ కేసులను పెంచుతున్న స్మార్ట్ ఫోన్ యాప్స్: ఐరాస అధ్యయనం
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వందలాది డేటింగ్ యాప్స్ కారణంగా ఎయిడ్స్ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కుల్లో హెచ్ఐవీ వైరస్ సోకుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని యునిసెఫ్, యూఎన్ ఎయిడ్స్ తదితర సంస్థలు చేసిన స్టడీలో వెల్లడైంది. కొత్తగా ఇన్ఫెక్షన్ సోకుతున్న వారిలో 15 శాతం మంది 20 ఏళ్లలోపు వారేనని పేర్కొంది. చిన్న వయసు యువతీ యువకుల్లో లైంగిక చర్యల పట్ల ఆసక్తిని పెంచుతున్న డేటింగ్ యాప్స్, ఆ తరువాత వారిని సుఖ రోగాల బారిన పడేట్టు చేస్తున్నాయని అభిప్రాయపడింది. 2014తో పోలిస్తే, బ్రిటన్ లో 19 శాతం అధిక గనేరియా కేసులు, 33 శాతం అధికంగా సిఫిలిస్ కేసులు నమోదయ్యాయని అధ్యయనం తెలిపింది.