: ఇలా ఎలా చెప్మా..! 12 వేల మంది పరీక్ష రాస్తే, 20 వేల మంది ఉత్తీర్ణత!


12 వేల మంది పరీక్ష రాస్తే 20 వేల మంది ఎలా ఉత్తీర్ణులయ్యారన్న అనుమానం కలిగిందా? ఆగ్రాలోని బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ అధికారుల తీరు అంతే మరి. బీఈడీ పరీక్షలను వర్శిటీ నిర్వహించగా, 12,800 మంది రెగ్యులర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎగ్జామ్స్ అనంతరం రిజల్ట్స్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్న వేళ, 20,089 మంది ఉత్తీర్ణులైనారని వర్శిటీ నుంచి ప్రకటన విడుదలైంది. ఆ వెంటనే విద్యార్థుల్లో కలకలం. 12,800 మంది వరకూ పరీక్ష రాస్తే, 20 వేలకు పైగా సమాధాన పత్రాలు ఉన్నాయట. విషయం బయటపడటంతో, ఫలితాలను నిలిపివేసిన ఉన్నతాధికారులు మొత్తం ఘటనపై విచారణకు ఆదేశించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులందరి వివరాలూ సమర్పించాలని వర్శిటీ వైస్ చాన్స్ లర్ మహమ్మద్ ముజామిల్ అన్ని ప్రైవేటు కాలేజీలకు లేఖలు పంపారు. కాగా, దాదాపు 7 వేల మంది అదనపు విద్యార్థులు పరీక్షలను రాసినట్టు తెలుస్తోంది. బీఈడీ కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే పరీక్షలు రాసిన వారి సంఖ్య ఎందుకు ఎక్కువైందని అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ప్రైవేటు కాలేజీల్లో ఉన్న బీఈడీ సీట్ల కన్నా అధిక సంఖ్యలో విద్యార్థులను చేర్చుకోవడమే ఇందుకు కారణమని, విషయాన్ని ముందుగానే వర్శిటీ గమనించలేకపోయిందని సమాచారం. అసలు ఏం జరిగిందోనన్న నిజాన్ని నిగ్గు తేల్చేందుకు ఉన్నతాధికారులు కదిలారు.

  • Loading...

More Telugu News