: దావూద్ లొంగుబాటును అడ్డుకున్న పీవీ...కండిషన్స్ కు నో!: శరద్ పవార్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు
1993 ముంబై పేలుళ్ల కేసు వెనుక ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం గొంతెమ్మ కోరికలు కోరుతూ, లొంగుబాటుకు పంపిన ప్రతిపాదనలను అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు వ్యతిరేకించారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. షరతులకు పీవీ అంగీకరించివుంటే అండర్ వరల్డ్ డాన్ లొంగిపోయి ఉండేవాడని "ఆన్ మై టర్మ్స్: ఫ్రం ది గ్రాస్ రూట్స్ టు ది కారిడార్ ఆఫ్ పవర్" అంటూ రాసిన పుస్తకంలో శరద్ ప్రస్తావించారు. ప్రముఖ న్యాయవాది రాం జఠ్మలానీని దావూద్ సంప్రదించాడని, లొంగిపోయి విచారణకు సహకరిస్తానని, అయితే, తనను జైల్లో ఉంచకుండా, గృహ నిర్బంధంలో ఉంచాలన్నది దావూద్ ప్రధాన డిమాండని చెప్పుకొచ్చారు. ఈ విషయమై దావూద్ ప్రతిపాదనలను అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తాను, ప్రధాని పీవీతో చర్చించినట్టు చెప్పారు. దావూద్ డిమాండ్లను పీవీ అంగీకరించలేదని వివరించారు. ముంబై దాడుల తరువాత పీవీ తనకు ఫోన్ చేసి, "మీ హత్యకు కుట్ర జరుగుతున్నట్టు తెలిసింది. వ్యక్తిగత భద్రతను పెంచుకోండి" అని సలహా ఇచ్చారని తెలిపారు.