: ఆటగాడిని కావాలనుకుని వేషగాడిని అయ్యాను!: బెంగళూరు 'ఐఐఎం'లో షారూఖ్


"డాక్టర్ ను కావాలనుకుని యాక్టర్ ను అయ్యాను" మన నిన్నటి తరం సినీ హీరోయిన్లకు పెద్ద ఊతపదం ఇది. కానీ, సూపర్ స్టార్ షారూఖ్ మాత్రం హాకీ లేదా క్రికెట్ ఆటగాడిగా దేశానికి సేవలందించాలని భావించాడట. తాను అనుకోకుండా మూవీ స్టార్ ను అయ్యానని, అంతకుముందు ఎన్నో ఇబ్బందులు పడ్డానని అన్నాడు. ఇప్పటికే యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్, యేల్ యూనివర్శిటీ తదితరాల్లో ప్రసంగాలు చేసిన షారూఖ్, తాజాగా బెంగళూరు ఐఐఎంలో జరిగిన లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొని "స్మార్ట్ అండ్ సెక్సీ పీపుల్" అనే అంశంపై ప్రసంగించారు. అనుకోకుండా మూవీ స్టార్ అయిన వారిలో తానూ ఒకడినని చెప్పుకున్న ఆయన, "చిన్నప్పుడు ఆటగాడిని కావాలని అనుకున్నా. కుదరలేదు. ప్రొఫెషనల్ స్థాయికి చేరుకోలేకపోయాను. ఇల్లు గడిచేందుకు ఓ నాటకాల కంపెనీలో చేరాల్సి వచ్చింది. నా తండ్రి మరణంతో మరిన్ని బాధలు అనుభవించాను. చిన్న ఇంటికి మారాల్సి వచ్చింది. 'ఫౌజీ' అనే సీరియల్ ను అమ్మకు తెలిసిన వ్యక్తి నిర్మిస్తుండగా, అతని వద్దకు నన్ను పంపింది. అప్పుడే ఆ సీరియల్ లో అభిమన్యు రాయ్ పాత్ర దక్కింది. ఆ తరువాత నా జీవితం వేగంగా మారిపోయింది. ఒకదాని తరువాత ఒకటిగా అవకాశాలు చేతికందాయి. నేనో మూవీ స్టార్ గా మారిపోయాను" అని వివరించాడు. తాను ఎన్నోమార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని, హీరోయిన్లలో కాజోల్, మాధురీ దీక్షిత్, ఆలియా భట్ లంటే అభిమానమని వెల్లడించాడు.

  • Loading...

More Telugu News