: ముగిసిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం... పలు అంశాలపై చర్చ


విజయవాడలోని గేట్ వే హోటల్ లో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, పుద్దుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ మంత్రులు, సీఎస్ లు పాల్గొన్నారు. ముందుగా చెన్నై వరద బాధితులు, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అనంతరం గత నవంబర్ లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో చేసిన తీర్మానాలపై చర్చించారు. ఈ సందర్భంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడం, వారికి కల్పించిన పునరావాస ప్యాకేజీపై ఏపీ నివేదిక సమర్పించింది. ఈ క్రమంలో మావోయిస్టుల విషయంలో ఏపీ మాదిరిగా ఏం చేశారో తెలపాలని దక్షిణాది రాష్ట్రాలను హోంశాఖ కోరింది. ఇక ఏపీ, తెలంగాణ మధ్య తలెత్తిన విద్యుత్ వివాదాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. సమస్యలు ఉమ్మడిగా పరిష్కరించుకుంటామని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు చెప్పారు. జాతీయ రహదారి భద్రత బిల్లుపై అభ్యంతరాలను తెెలంగాణ ప్రస్తావించగా, సముద్రంలో మత్స్యకారుల చేపల వేట అంశంపై కేరళ ప్రస్తావించింది. కోస్ట్ గార్డు, కేంద్ర హోంశాఖ మత్స్యకారులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాల్లో డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ను పటిష్టం చేయడంపై తీర్మానం చేశారు. అంతేగాక దక్షిణాది రాష్ట్రాల్లో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై, తమిళనాడు, ఏపీ నుంచి మనుషుల అక్రమ రవాణాపై సమావేశంలో చర్చించారు. దాంతో అక్రమ రవాణాపై సీఐడీ అధికారులు చర్యలు చేపట్టాలని హోంశాఖ సూచించింది. ఎర్రచందనం సమస్యను అంతర్రాష్ట్ర సమస్యగా గుర్తించాలని, ఈ సమస్యపై సమష్టిగా పోరాడాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దక్షిణాది రాష్ట్రాల తదుపరి సమావేశం కేరళలోని తిరువనంతపురంలో జరగనుంది.

  • Loading...

More Telugu News