: మంత్రిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తికి ఘన సన్మానం... నగదు పురస్కారం అందించిన సిక్కులు


మంత్రి పదవిలో ఉన్న రాజకీయ నేత గూబ పగులగొట్టిన వ్యక్తిని సిక్కు ర్యాడికల్ గ్రూపు శిరోమణి అకాలీదళ్ (అమృత్ సర్) ఘనంగా సన్మానించింది. అంతేకాదు, రూ.2.20 లక్షల నగదు పురస్కారాన్ని అందజేసి పంజాబ్ సర్కారుకు సవాల్ విసిరింది. వివరాల్లోకెళితే... గత నెల 20న పంజాబ్ లోని భటిండా ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సికిందర్ సింగ్ ను జర్నైల్ సింగ్ అనే ఓ సామాన్య వ్యక్తి చెంప పగుల గొట్టాడు. ఈ సందర్భంగా సికిందర్ సింగ్ అనుచరులు, ఆ రాష్ట్ర అధికార పార్టీ అకాలీదళ్ పార్టీ కార్యకర్తలు జర్నైల్ సింగ్ ను చుట్టుముట్టి పిడిగుద్దులు కురిపించారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని వదిలేయకుండా పోలీసులకు అప్పజెప్పారు. ఇక ఈ ఘటనను కాస్తంత సీరియస్ గా తీసుకున్న పంజాబ్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిన్న సిక్కు ర్యాడికల్స్ జర్నైల్ సింగ్ ఇంటికి వచ్చి అతడిని పరామర్శించారు. అతడికి రూ.2.20 లక్షలను అందజేశారు. ప్రస్తుతం ఈ విషయంపై ప్రభుత్వం పూర్తి స్థాయి వివరాలను సేకరించే పనిలో పడింది.

  • Loading...

More Telugu News