: రాజకీయాలకు కంచుకోట... కలల కాణాచి నరసరావుపేట: వెంకయ్యనాయుడు


గుంటూరు జిల్లా నరసరావుపేట రెండవ రోజు శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ముందుగా టౌన్ హాల్ వద్ద ఆర్ యూబీ పార్కులకు, భూగర్భ డ్రైనేజీ, పక్కాగృహాల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఉత్సవాల వేదికపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ ఉత్సవాల ద్వారా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు కంచుకోట... కలల కాణాచి నరసరావుపేట అని, అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని పేర్కొన్నారు. నరసరావుపేటకు గొప్ప చరిత్ర ఉందని, ఉద్యమాలకు ఊపిరిగా, పౌరుషానికి ప్రతీకగా నరసరావుపేట నిలిచిందని ప్రశంసించారు. అనేక వర్గాల కోసం నరసరావుపేటలో శ్మశాన వాటికలను నిర్మించారని, జిల్లా కేంద్రం గుంటూరు అయినా శాసించేది మాత్రం నరసరావుపేటేనని కీర్తించారు. కన్న తల్లిని, జన్మభూమిని, దేశాన్ని మరచిన వారు మానవులే కాదన్న వెంకయ్య, స్పీకర్ కోడెల ఈ నరసరావుపేటను ఎంతో అభివృద్ధి చేస్తున్నారని మెచ్చుకున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది మహానుభావులు రాజకీయాల్లో ఉన్నారని, కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా, కాసు కృష్ణారెడ్డి మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారని వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు ఈ ప్రాంత వ్యక్తే కాగా, నవ్యాంధ్ర తొలి స్పీకర్ కూడా ఈ ప్రాంత వ్యక్తి అయిన కోడెల శివప్రసాద్ కావడం కాకతాళీయమని వెంకయ్య వివరించారు. కోడెల స్పీకర్ అయినప్పటికీ వర్కర్ గా ఎన్నో పనులు చేస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News