: సంబంధాలు మెరుగైతేనే... దాయాదుల పోరు: పాక్ కు తేల్చిచెప్పిన సుష్మా స్వరాజ్
విశ్వవ్యాప్తంగా ‘దాయాదుల పోరు’గా పేరుపడ్డ భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ లు ఇకపై రెగ్యులర్ గా జరిగేందుకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ), భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ల మధ్య గతేడాది ఒప్పందమైతే కుదిరింది కానీ, అది కార్యరూపం దాల్చేందుకు ఇంకా సమయం పట్టేలానే ఉంది. శ్రీలంకలో ఈ నెల చివరలో సిరీస్ ను నిర్వహించేందుకు పాక్ ప్రభుత్వం పీసీబీకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక తన జట్టును పంపేందుకు బీసీసీఐ కూడా సిద్ధంగానే ఉన్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా ఇరు దేశాల మధ్య నిలిచిన చర్చలు మళ్లీ పునరుద్ధరణకు నోచుకున్నాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మూడు రోజుల క్రితం నేరుగా పాక్ రాజధాని ఇస్లామాబాదు వెళ్లారు. అక్కడ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో పాటు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సర్తాజ్ అజీజ్ తోనూ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, ఇరువురి మధ్య పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న పలు అంశాలతో పాటు క్రికెట్ అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. దీనిపై సుష్మా స్వరాజ్ ఇప్పటిదాకా నోరు విప్పలేదు. అయితే నిన్న సర్తాజ్ మాత్రం సిరీస్ పై చర్చ జరిగిందని చెప్పారు. ‘‘సంబంధాలు బలపడితేనే, క్రికెట్ సహా అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్లే వీలు ఉంటుంది’’ అని సుష్మా చెప్పారని ఆయన పేర్కొన్నారు. మరి, సంబంధాలు ఎప్పుడు బలోపేతమవుతాయి, సిరీస్ కు కేంద్రం ఎప్పుడు పచ్చజెండా ఊపుతుందనే విషయంపై ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.