: సోనియా గాంధీ వ్యవహారశైలిని బయటపెట్టిన శరద్ పవార్


సోనియా గాంధీ అంటే ప్రధాని పదవిని తృణప్రాయంగా వదిలేసిన త్యాగమూర్తి. పార్టీ పట్టుబట్టడంతో రాజకీయాల్లోకి వచ్చిన ధీశాలి...ఇవీ ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు సోనియా గురించి బాహ్య ప్రపంచానికి చెప్పిన మాటలు. అటువంటి సోనియా వ్యవహార శైలిని కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తన ఆత్మకథ 'ఆన్ మై టెర్మ్-ఫ్రం ద గ్రాస్ రూట్స్ టు ద కారిడార్స్ ఆఫ్ పవర్'లో బయటపెట్టారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ)ని సోనియా గాంధీకి అనుకూలంగా మారుస్తూ పార్టీ రాజ్యాంగంలో దిగ్భ్రాంతికర మార్పు తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. దీని ద్వారా సీపీపీ లీడర్ పదవి చేపట్టేందుకు ఎంపీ అయి ఉండాలన్న నిబంధనను పక్కనపెట్టారు. ఈ నిర్ణయం తనను చాలా బాధపెట్టిందని ఆయన రాసుకున్నారు. ఈ పరిణామంతో సోనియాకు, తనకు మధ్య భారీ అగాధం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అప్పటి నుంచి లోక్ సభలో సోనియా గాంధీ తన నిర్ణయాలను పక్కనపెట్టడం మరింత దూరం పెంచిందని ఆయన వెల్లడించారు. సోనియాతో కలిసి తాను ఏదైనా నిర్ణయం ఉమ్మడి తీసుకుంటే, ఆ తర్వాత దానికి పూర్తి వ్యతిరేకంగా ఆమె ప్రవర్తించేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది పాటు ఇదే విధానం కొనసాగిందని ఆ తరువాత అది బద్దలైందని ఆయన తెలిపారు. 1999 ఏప్రిల్ 17న వాజ్ పేయి ప్రభుత్వం పడిపోయింది. అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ను ఏప్రిల్ 21న కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తూ తమకు 272 మంది ఎంపీల బలముందని సోనియా గాంధీ ప్రకటన చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ కు మద్దతు ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ అధికారం చేపట్టలేకపోయింది. అయితే అప్పట్లో లోక్ సభలో పార్టీ నాయకుడిగా ఉన్న తనను సంప్రదించాలని సోనియా గాంధీ భావించకపోవడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన తన ఆటో బయోగ్రఫీలో రాసుకున్నారు.

  • Loading...

More Telugu News