: ప్లాటినమ్ పై మనసు పారేసుకుంటున్న దక్షిణాది యువకులు!


బంగారం పేరు చెబితే మగువలు మనసు పారేసుకుంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అంతకన్నా విలువైన ప్లాటినమ్ తో తయారు చేసిన ఆభరణాలపై పురుషులు మక్కువ చూపుతున్నారు. అందునా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన యువకులు, ప్లాటినమ్ ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ విషయాన్ని ఓరా, అబారన్, సెన్కో వంటి ప్లాటినమ్ జ్యూయెలరీని మార్కెటింగ్ చేస్తున్న సంస్థలు చెబుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడు పురుషుల ఆభరణాల విభాగంలో 25 నుంచి 30 శాతం వృద్ధి నమోదైందని, ప్లాటినమ్ ఉంగరాలు, బ్రేస్ లెట్లతో పాటు చెయిన్ల అమ్మకాలు పెరుగుతున్నాయని రిటెయిలర్లు చెబుతున్నాయి. ఇక ఓరా సంస్థ ఏకంగా 60 శాతం మేరకు అమ్మకాలను పెంచుకుంది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుషులు బంగారు ఆభరణాలతో పోలిస్తే, ప్లాటినమ్ ఆభరణాలను అధికంగా కొనుగోలు చేస్తున్నారని ఈ రంగంలోని రిటెయిలర్లు అంటున్నారు. "స్ట్రాట్ వన్ రీసెర్చ్ జరిపిన 'ఇండియన్ ప్లాటినమ్ రిటైల్ ట్రేడ్ బారోమీటర్ 2014' సర్వే ప్రకారం, ఇండియాలో ప్లాటినమ్ ఆభరణాల అమ్మకాలు శరవేగంగా పెరుగుతున్నాయి" అని ప్లాటినమ్ గిల్డ్ ఇండియా ఎండీ వైశాలీ బెనర్జీ వివరించారు. లగ్జరీ యాక్సెసరీస్ వాడకం పెరుగుతున్న వేళ, యువకుల చాయిస్ ప్లాటినమ్ వైపు మళ్లుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని ఆయన అన్నారు. కాగా, 2014లో ఆభరణాల తయారీ నిమిత్తం ఇండియాలోకి 5.7 టన్నుల ప్లాటినమ్ దిగుమతి కాగా, ఈ సంవత్సరం అది 6.5 టన్నులకు పెరిగింది. గడచిన ఎనిమిది నెలల కాలంలో దాదాపు 4 టన్నులకు పైగా ప్లాటినమ్ ఇండియాకు వచ్చి చేరింది. "కొన్నేళ్ల క్రితం వరకూ ప్లాటినమ్ ఆభరణాలంటే, వెండి మాదిరిగానే కనిపిస్తాయన్న ఆలోచనలో ప్రజలు ఉండేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. స్టయిల్ ను కోరుకుంటున్న నేటి తరం యువత ఈ విలువైన లోహానికి దగ్గరవుతోంది" అని ఓరా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ జైన్ వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, ఒక గ్రాము బంగారానికీ, ప్లాటినమ్ కు మధ్య ధరలో వ్యత్యాసం రూ. 200 నుంచి రూ. 300 వరకూ ఉంటుంది. గ్రాము ప్లాటినమ్ ధర ప్రస్తుతం రూ. 2,700 నుంచి రూ. 2,800 మధ్య ఉండగా, బంగారం రూ. 2,500 నుంచి రూ. 2,600 మధ్య కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News