: గోల్డ్ ఫ్యూచర్స్ డౌన్... మరింత దిగిరానున్న బంగారం!
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సంకేతాలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో గోల్డ్ ఫ్యూచర్స్ కుదేలయ్యాయి. ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ మార్కెట్ సెషన్ లో భవిష్యత్తులో బంగారం కోసం వేసే ఆర్డర్లలో ధరలు గణనీయంగా తగ్గాయి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో డెలివరీ కాంట్రాక్టు బంగారం ధర 10 గ్రాములకు రూ. 25,323కు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 0.37 శాతం తక్కువ. ఈ కాంట్రాక్టులో ఉదయం 11:30 గంటల వరకూ మొత్తం 205 లాట్ల బంగారం ట్రేడింగ్ జరిగింది. ఇక ఏప్రిల్ డెలివరీ బంగారం ధర 0.30 శాతం తగ్గి రూ. 25,450కి చేరింది. మరో వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్ష ఉన్నందునే బులియన్ సెంటిమెంట్ నశిస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక ఈ ఉదయం ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 0.5 శాతం తగ్గి 1,066.37 డాలర్లకు చేరింది. కాగా, ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయంటే, స్పాట్ మార్కెట్లో అది మరింత పతనం ఎదురుచూస్తున్నట్టే! కాబట్టి, బంగారం ధరలు ఇంకాస్త దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.