: ప్రపంచమంతా చీదరించుకుంటున్నా... అమెరికన్లకు దగ్గరవుతున్న డొనాల్డ్ ట్రంప్


ముస్లింల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి, ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలైన డొనాల్డ్ ట్రంప్, అమెరికన్లకు మాత్రం తెగ దగ్గరవుతున్నారు. వచ్చే సంవత్సరం జరిగే అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున పోటీ పడతారని భావిస్తున్న ఆయనకు మద్దతు గణనీయంగా పెరిగిందని న్యూయార్క్ టైమ్స్ / సీబీఎస్ నిర్వహించిన పోల్ లో వెల్లడైంది. అమెరికాపై మరో ఉగ్రదాడి జరగకముందే, కఠిన చర్యలు చేపట్టాలని గట్టిగా భావిస్తున్న ఆ దేశ ప్రజలు డొనాల్డ్ కు మద్దతివ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఓ నెల రోజుల క్రితం ఉగ్రవాదం మాత్రమే అమెరికా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యని కేవలం 4 శాతం మంది మాత్రమే అభిప్రాయపడగా, ఇప్పుడా సంఖ్య 19 శాతానికి చేరింది. ఈ నెల రోజుల వ్యవధిలో జరిగిన పారిస్ దాడులు, ఆపై కాలిఫోర్నియాలో కాల్పులు అమెరికన్ల మనసు మారడానికి కారణమయ్యాయి. కాగా, ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ, ఒక్క ముస్లిం కూడా అమెరికాలో కాలు పెట్టకుండా నిషేధం విధించాలని, దేశంలోని మదార్సాలన్నీ మూసివేయాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రతి 10 రిపబ్లికన్ ప్రైమరీ ఓటర్లలో నాలుగుకు పైగానే ట్రంప్ కు వస్తున్నట్టు తెలుస్తోంది. తదుపరి నెల రోజుల వ్యవధిలో అమెరికాపై మరో ఉగ్రదాడి జరగవచ్చని భయపడుతున్నట్టు అత్యధిక అమెరికన్లు ఈ పోల్ కు వెల్లడించారు. సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మందిలో ఏడుగురు ఇస్లామిక్ స్టేట్ ప్రపంచానికి పెనుముప్పని అభిప్రాయపడటం గమనార్హం.

  • Loading...

More Telugu News