: తిరుపతికి వస్తున్న చెన్నై ఐటీ... భవనాలు వెతుకుతున్న టీసీఎస్, హెచ్సీఎల్!
చెన్నైని పది రోజుల పాటు వణికించిన వరద, ఆ నగరాన్నే నమ్ముకుని ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల్లో భయాన్ని పెంచింది. వరదల కారణంగా వేల కోట్ల రూపాయల నష్టాన్ని కళ్లజూసిన ఐటీ పరిశ్రమ ఇప్పుడు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతోంది. ప్రధాన సర్వర్ల నుంచి కంప్యూటర్ల వరకూ నీట మునిగి దాదాపు నెల రోజుల పాటు ఎటువంటి కార్యకలాపాలూ జరగని పరిస్థితిని అనుభవిస్తున్న ప్రముఖ కంపెనీలు, మరోసారి ఇటువంటి పరిస్థితి రాకముందే జాగ్రత్త పడాలన్న భావనతో, తిరుపతి వైపు చూస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్, హెచ్సీఎల్ సంస్థలు తిరుపతి సమీపంలో తమ శాఖలు ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక వసతుల కోసం చూస్తున్నాయి. చెన్నైలోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వారిలో 30 శాతం మంది వరకూ తిరుపతి, నాయుడుపేట పరిసరాల్లో ఉంటున్న వారే కావడంతో, తిరుపతిలో శాఖలు ఏర్పాటు చేసి, ఆపై ఉద్యోగుల స్పందన బట్టి పూర్తిగా తరలిరావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చెన్నైతో పోలిస్తే, తిరుపతి సమీపంలో ప్రకృతి వైపరీత్యాల బెడద అంతగా లేకపోవడంతోనే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఐటీ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.