: ఐఎస్ఐఎస్ లో చేరమంటూ యువతను ప్రేరేపిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మేనేజర్ అరెస్ట్


ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మార్కెటింగ్ మేనేజర్ ను జైపూర్ లో పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. ఇస్లామిక్ స్టేట్ తరఫున పనిచేస్తూ, ఆన్ లైన్లో, సామాజిక మాధ్యమాల ద్వారా ముస్లిం యువతను ఆకర్షించి, వారి మనసులను మార్చి, ఉగ్రవాదం వైపు నడిపించే కార్యకలాపాలు సాగిస్తున్నాడన్నది ఇతనిపై అభియోగం. కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన మహమ్మద్ సిరాజుద్దీన్ (30) ఏప్రిల్ 2014 నుంచి జైపూర్ లో నివాసం ఉంటున్నాడు. ఏటీఎస్ పోలీసుల కథనం ప్రకారం, సిరాజుద్దీన్ కార్యకలాపాలపై పూర్తి సాక్ష్యాలున్నాయి. ఆయన ఆన్ లైన్ యాక్టివిటీని విశ్లేషించామని, వాట్స్ యాప్, ఫేస్ బుక్ తదితరాల ద్వారా యువతను చెడగొడుతున్నాడని రాజస్థాన్ ఏటీఎస్ విభాగం అడిషనల్ డీజీపీ అలోక్ త్రిపాఠి వెల్లడించారు. తాను ఐఎస్ఐఎస్ కోసం పనిచేస్తున్నట్టు ప్రాథమిక ఇంటరాగేషన్ లో సిరాజుద్దీన్ అంగీకరించాడని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని, నేడు కోర్టు ముందుకు హాజరు పరుస్తామని తెలిపారు. ఆయన ల్యాప్ టాప్ లో ఐఎస్ఐఎస్ తన ప్రచారం నిమిత్తం మార్కెటింగ్ చేస్తున్న 'దబీఖ్' మ్యాగజైన్ సంచికలు ఎన్నో ఉన్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News